Yogi Adityanath: యూపీ కార్మికులకు రాష్ట్రాలు ఉపాధి కల్పించాలంటే ముందు మా అనుమతి తీసుకోవాలి: యోగి ఆదిత్యనాథ్

UP CM Yogi says any state can not employ UP migrants without state government permission

  • యూపీకి తిరిగొచ్చిన 20 లక్షల మంది వలస కార్మికులు
  • యూపీ కార్మికుల పట్ల ఇతర రాష్ట్రాలు సరిగా వ్యవహరించడంలేదన్న యోగి
  • కార్మికుల ఉపాధి కోసం కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి

దేశ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల పాత్రే కీలకం. కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుతం ఎవరి రాష్ట్రాలకు వారు చేరుకుంటున్నారు. లాక్ డౌన్ ముగిశాక వలస కార్మికులు తిరిగి తమ ఉపాధి ప్రాంతాలకు వెళతారా లేక స్వస్థలాల్లోనే ఉండిపోతారా అనేదానిపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రమైనా ఉత్తరప్రదేశ్ వలస కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడ చూసినా విపత్కర పరిస్థితి నెలకొన్న తరుణంలో యూపీలో ప్రత్యేకంగా వలస కార్మికుల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోనే వారికి ఉపాధి కల్పించేందుకు ఈ కమిషన్ సాయపడుతుందని వెల్లడించారు. ఇప్పటికే అధికారులకు ఈ విషయమై సూచనలు చేశానని యోగి వివరించారు. యూపీలోని మానవ వనరులను ఏ రాష్ట్రమైనా కోరుకుంటే వారికి బీమా సౌకర్యంతో పాటు సామాజిక భద్రత కూడా కల్పిస్తామని, కానీ మా అనుమతి లేకుండా ఏ రాష్ట్రం కూడా ఇక్కడివాళ్లను తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. యూపీ కార్మికుల పట్ల ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరే అందుకు కారణమని అన్నారు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో 20 లక్షల మంది వలస కార్మికులు యూపీకి తిరిగొచ్చారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News