Police: సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై కన్నేసి... ఇన్ని హత్యలు చేశాడు: గొర్రెకుంట బావి ఘటనపై సీపీ వివరణ

Police introduce Gorrekunta murders accused in front of media

  • నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
  • ఓ మహిళతో సహజీవనం చేసిన నిందితుడు సంజయ్
  • ఆమె కుమార్తెతో చనువుగా మెలిగిన వైనం
  • వ్యతిరేకించిన మహిళ

వరంగల్ శివారు ప్రాంతంలోని ఓ పాడుబడ్డ బావిలో 9 మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో లభ్యమైన ఆ మృతదేహాల్లో ఆరు మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కాగా, మరో ముగ్గురు ఇతరులు. ఈ కేసును ఓ సవాల్ గా తీసుకున్న పోలీసులు మూడ్రోజుల్లోనే నిందితుడు సంజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నిందితుడు తానే ఆ హత్యలు చేసినట్టు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో, పోలీసులు నిందితుడు సంజయ్ కుమార్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ మీడియాకు వివరాలు తెలిపారు.

ఈ ఘటనపై చాలా సందేహాలు వచ్చాయని, ఇవి ఆత్మహత్యలా? అనే కోణంలోనూ అనుమానాలు కలిగాయని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ కూడా తమకు ఎంతో సాయపడిందని వెల్లడించారు.

"మక్సూద్ కుటుంబం నాలుగైదేళ్ల కిందట కీర్తినగర్ లో ఉండేది. వారు శాంతినగర్ లో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా అక్కడ వారికి సంజయ్ కుమార్ యాదవ్ తో పరిచయం అయింది. మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకా (37) ఐదేళ్ల కిందట ముగ్గురు పిల్లలతో వరంగల్ వచ్చేసింది. అక్కడే మక్సూద్ సాయంతో గోనె సంచుల కర్మాగారంలో పనికి కుదిరింది. అక్కడే పనిచేస్తున్న సంజయ్ కుమార్ ఒంటరివాడు కావడంతో అతడికి వంట చేసి పెట్టి డబ్బులు తీసుకునేది. ఆ విధంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో సంజయ్, రఫీకా మరో ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు.

అయితే రఫీకా కుమార్తె యుక్త వయస్సుకొచ్చింది. ఆ అమ్మాయితో సంజయ్ చనువుగా ఉండడాన్ని రఫీకా భరించలేకపోయింది. సంజయ్ మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అతడి ఉద్దేశాన్ని పసిగట్టిన రఫీకా అతడ్ని నిలదీసింది. తామిద్దరం పెళ్లి చేసుకుందామని గట్టిగా అడిగింది. దాంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి పక్కాగా స్కెచ్ వేసిన సంజయ్... పశ్చిమ బెంగాల్ వెళ్లి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మించి ఆమెతో కలిసి రైలెక్కాడు. రైల్లో మజ్జిగ ప్యాకెట్ లో నిద్రమాత్రలు వేసి రఫీకాకు ఇచ్చాడు. రాత్రి 3 గంటల వేళ చున్నీతో మెడకు బిగించి చంపేసి, శవాన్ని రైలు నుంచి బయటికి తోసేశాడు. ఆపై ఏమీ ఎరగనివాడిలా రాజమండ్రిలో దిగిపోయాడు. తిరిగి వరంగల్ వచ్చేశాడు.

అయితే, ఒంటరిగా రావడంతో మక్సూద్ భార్య నిషా నిలదీసింది. రఫీకా ఏమైంది? అని సంజయ్ ని గట్టిగా ప్రశ్నించింది. చెప్పకపోతే పోలీసులకు చెబుతామని హెచ్చరించింది. దాంతో వాళ్లను అడ్డుతొలగించుకోవాలని సంజయ్ ప్లాన్ చేశాడు. ఇంతలో షాబాజ్ పుట్టినరోజు రావడంతో తన ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ మెడికల్ షాపులో నిద్రమాత్రలు కొని అదను చూసి ఆహార పదార్థాల్లో కలిపేశాడు. తన హత్యలకు ఎవరూ సాక్షులుగా ఉండరాదని భావించి అదే భవనంలో ఉన్న ఇద్దరు బీహార్ కుర్రాళ్లను కూడా లేపేయాలని నిర్ణయించుకుని వాళ్ల ఆహారంలోనూ మాత్రలు కలిపాడు. ఈ వేడుక కోసం బయటి నుంచి వచ్చిన షకీల్ అనే వ్యక్తి కూడా సంజయ్ ప్లాన్ కు బలయ్యాడు.

అందరూ మగతగా పడుకుండి పోగా, ఒక్కొక్కరిని గోనె సంచిలో కుక్కి బావిలో వేశాడు. ఈ విధంగా తొమ్మిది మందిని బావిలో వేసేశాడు" అని సీపీ వివరించారు. తమకు సీసీటీవీ ఫుటేజి ఎంతో సాయపడిందని, నిందితుడు సంజయ్ కుమార్ కదలికలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News