Kanna Lakshminarayana: ఒక చీటింగ్ జీవో ఇచ్చి ఆఖరికి దేవుడ్ని కూడా మోసం చేశారు: కన్నా
- టీటీడీ ఆస్తుల విక్రయం నిలిపివేస్తూ ఏపీ సర్కారు జీవో
- 2016లో టీటీడీ ఇచ్చిన ఆర్.253ని మాత్రమే నిలిపివేశారన్న కన్నా
- ఇప్పటి టీటీడీ ఇచ్చిన ఆర్.309ని నిలిపివేయలేదని వెల్లడి
టీటీడీ ఆస్తుల అమ్మకం అంశంపై ఇంకా రాజకీయావేశాలు చల్లారలేదు. ఆస్తుల విక్రయం నిలుపుదల చేస్తూ నిన్న ఏపీ సర్కారు జీవో నెం.888 జారీ చేసినా ఏపీ బీజేపీ మాత్రం నిప్పులు చెరుగుతోంది. వాస్తవానికి టీటీడీ ఆస్తుల విక్రయానికి నిరసనగా ఇవాళ ఏపీలో బీజేపీ-జనసేన సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఇంతలోనే ఏపీ సర్కారు జీవో తీసుకువచ్చింది.
దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, టీటీడీ ఆస్తుల అమ్మకంపై బీజేపీ పోరాటం చేపట్టడంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చినట్టు నటిస్తోందని, జీవో నెం.888 జారీ చేయడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. అయితే ఆ జీవో ఒక చీటింగ్ జీవో అని, తద్వారా ఈ ప్రభుత్వం ఆఖరికి దేవుడ్ని కూడా మోసం చేసిందని ఆరోపించారు. 2016లో అప్పటి టీటీడీ బోర్డు ఇచ్చిన ఆర్.253ని నిలుపుదల చేశారే తప్ప, ఈ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు ఇచ్చిన ఆర్.309ని రద్దు చేయలేదని, ఇది పూర్తిగా మోసపూరితం అని మండిపడ్డారు.