Ben Stokes: వరల్డ్ కప్ లో ధోనీ ఆటతీరుపై బెన్ స్టోక్స్ విస్మయం
- బెన్ స్టోక్స్ జీవితంపై పుస్తకం
- త్వరలోనే మార్కెట్లోకి రానున్న 'ఆన్ ఫైర్'
- ధోనీలో తీవ్రత కనిపించలేదన్న స్టోక్స్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్ ఫినిషింగ్ నైపుణ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ వరల్డ్ కప్ లో ధోనీ ఆడిన తీరే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన సహజశైలికి భిన్నంగా పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడి విమర్శలపాలయ్యాడు.
దీనిపై ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన పుస్తకం 'ఆన్ ఫైర్' లో స్పందించాడు. ఇంగ్లాండ్ తో టీమిండియా మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ విస్మయానికి గురిచేసిందని తెలిపాడు. 11 ఓవర్లలో 112 పరుగులు చేస్తే గెలుస్తారన్న దశలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీలో పరిస్థితికి తగిన కసి, ఊపు కనిపించలేదని, భారీ షాట్లు కొట్టే బదులు సింగిల్స్ తోనే సరిపెట్టుకోవడం కొత్తగా అనిపించిందని పేర్కొన్నాడు.
"ఆ సమయంలో ధోనీతో పాటు క్రీజులో ఉన్న కేదార్ జాదవ్ సంగతి సరేసరి. అతడు కూడా మందకొడిగా కనిపించాడు. మ్యాచ్ అంతా అయిపోయాక కోహ్లీ బౌండరీ లైన్ నిడివిపై వ్యాఖ్యలు చేయడం వింతగా అనిపించింది. బౌండరీ లైన్ రెండు జట్లకు ఒకే నిడివితో ఉన్నప్పుడు ఒక జట్టే లాభపడుతుందనడంలో అర్థంలేదు. కోహ్లీ అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు" అంటూ బెన్ స్టోక్స్ తన పుస్తకంలో వివరించాడు. ఈ పుస్తకం త్వరలోనే మార్కెట్లోకి రానుంది.