China: 45 రోజుల్లో ఎంత తేడా... లడఖ్ సమీపంలో చైనా ఎయిర్ బేస్ విస్తరణ చిత్రాలివి!
- తాజా శాటిలైట్ చిత్రాల విడుదల
- అభివృద్ధి చెందిన ఎయిర్ బేస్ లో యుద్ధ విమానాలు
- పాంగ్యాంగ్ కు 200 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ బేస్
ఏప్రిల్ 6 నుంచి మే 21 మధ్య లడఖ్ కు సమీపంలోని తన ఎయిర్ బేస్ ను చైనా భారీగా విస్తరించింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను 'డెట్రెస్ఫా' విడుదల చేయగా ఎన్డీటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారత్, చైనా సైనికుల మధ్య ఈ నెల 5, 6 తేదీల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన పాంగ్యాంగ్ సరస్సుకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్ బేస్ ఉండటం గమనార్హం.
తొలి ఇమేజ్ ఏప్రిల్ 6వ తేదీతో ఉండగా, మే 21వ తేదీతో రెండో ఇమేజ్ ఉంది. ఈ రెండు చిత్రాల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. రెండో రన్ వే, హెలికాప్టర్లను నిలిపివుంచేందుకు స్థలంతో పాటు జే-11 లేదా జే-16 ఫైటర్ విమానాలను నిలిపేందుకు బేస్ సైతం కేవలం 45 రోజుల వ్యవధిలో నిర్మితమైపోయినట్టు తెలుస్తోంది.
భారత్ వద్ద ఉన్న రష్యాకు చెందిన సుఖోయ్ 27 ఫైటర్ జెట్స్ తో సరి సమానం కాగల విమానాలు జే-11, జే-16లను చైనా దేశీయంగా తయారు చేసుకున్న సంగతి తెలిసిందే. చైనా ఎయిర్ బేస్ ను విస్తరించిన ప్రాంతంలో యుద్ధ విమానాలు కూడా కనిపిస్తూ ఉండటాన్ని ఈ చిత్రాల్లో చూడవచ్చు.
ఇక ఈ ప్రాంతంలో నిలిపివుంచిన చైనా యుద్ధ విమానాలు, అసలైన ఎయిర్ బేస్ తో నిలిపివుంచిన యుద్ధ విమానాలతో పోలిస్తే, మరింత సమయం పాటు ఎగిరే అవకాశం ఉంటుంది. భారత సరిహద్దుల్లో చైనా ఆగడాలు పెచ్చుమీరుతున్న వేళ, నేపాల్ సైతం చైనాకు అనుకూల ధోరణితో వ్యాఖ్యానిస్తుండగా, ఈ తాజా పరిణామం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.