Marriage: సమయానికి మంగళసూత్రాన్ని అందించిన పోస్టల్ శాఖ... 'జూమ్' ద్వారా ఆశీర్వదించిన బంధుమిత్రులు!
- పూణెలో ఉద్యోగాలు చేస్తున్న కేరళ అమ్మాయి, అబ్బాయి
- గత సంవత్సరమే నిశ్చితార్థం
- పెళ్లిని వాయిదా వేయకుండా వినూత్న ప్రయత్నం
వినూత్న రీతిలో వివాహం చేసుకున్న ఓ కేరళ జంట, ఈ క్షణాలు తమ జీవితాంతం గుర్తుండి పోతాయని అంటోంది. లాక్ డౌన్ కారణంగా ఎన్నో వివాహాలు ఆగిపోగా, మరికొన్ని ఆంక్షల నడుమ సాదాసీదాగా సాగుతున్నాయి. ఇక, కేరళకు చెందిన విఘ్నేష్, అంజలి పూణెలో పని చేస్తుండగా, వారికి గత సంవత్సరమే వివాహం నిశ్చయమైంది. వీరు వివాహం నిమిత్తం స్వస్థలానికి వెళ్లే సమయానికి లాక్ డౌన్ అమలులోకి రాగా, వీరు నిరాశ చెందలేదు. పెళ్లిని వాయిదా వేసేందుకు అంగీకరించకుండా, ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని భావించారు.
పూణెలో వధూవరులు మాత్రమే ఉండగా, వారి బంధువులు ఎవరూ అక్కడకు వెళ్లే వీలులేకపోయింది. పూణెలోని స్నేహితులు వివాహ ఏర్పాట్లు చేయగా, వీరిద్దరి తల్లిదండ్రులూ, కేరళ నుంచి మంగళసూత్రాన్ని పోస్టులో పంపించారు. సమయానికి ఇండియన్ పోస్టల్ శాఖ తాళిబొట్టును స్పీడ్ పోస్టులో అందించింది. ఇక, వారి వివాహాన్ని జూమ్ యాప్ లో బంధువులంతా తిలకించి, ఆశీర్వదించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్నేహితులు, బంధువులు పెళ్లిని చూశారని, ఇదో భిన్నమైన అనుభూతని ఈ సందర్భంగా అంజలి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లలేమని భావించిన తరువాతనే పూణెలోనే పెళ్లికి సిద్ధమయ్యామని వారు తెలిపారు.