Jayalalitha: జయలలిత ఆస్తులకు వారసులు వీరే: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
- జయ వారసులు దీప, దీపక్
- జయ ఆస్తులు వీరిద్దరికే చెందుతాయి
- వేద నిలయంలో సీఎం కార్యాలయం, మ్యూజియం ఏర్పాటు చేయండి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జయ ఆస్తుల విషయంలో ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లను చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది. చనిపోయేంత వరకు జయ పెళ్లి చేసుకోలేదని... అందువల్ల ఆమెకు దీప, దీపక్ తప్ప మరెవరూ చట్టబద్ధమైన వారసులు లేరని కోర్టు వ్యాఖ్యానించింది. జయ ఆస్తులు వీరిద్దరికే చెందుతాయని చెప్పింది. జయలలిత పేరు మీద రూ. 913 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
జయ నివాసమైన వేదనిలయంలో సగభాగాన్ని సీఎం కార్యాలయంగా, మిగిలిన సగభాగాన్ని ఆమె స్మారకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్నాడీఎంకే నేత పుహలేంది వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. తమ సూచనలపై సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 8 వారాల గడువు ఇచ్చింది. వేద నిలయం విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని... అందువల్ల జయ వారసులకు కూడా దీని విషయంలో నోటీసులు ఇవ్వాలని, వారి వాదనలను కూడా వినాలని చెప్పింది.