PCB: టీ-20 వరల్డ్ కప్ స్థానంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు... పాకిస్థాన్ కడుపుమంట వ్యాఖ్యలు!
- టీ-20 వరల్డ్ కప్ వాయిదా
- నేడు అధికారికంగా వెల్లడించనున్న ఐసీసీ
- ఆ సమయాన్ని ఐపీఎల్ కు కేటాయిస్తారని వార్తలు
- దేశీయ టోర్నీలను చొప్పిస్తామంటే అంగీకరించబోమన్న పీసీబీ
ఈ సంవత్సరం జరగాల్సిన టీ-20 వరల్డ్ కప్ దాదాపుగా వాయిదా పడటం ఖాయమైన నేపథ్యంలో ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. నేడు అన్ని దేశాల సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ఐసీసీ, ఆపై వరల్డ్ కప్ వాయిదాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆపై ఆ రోజుల్లో ఐపీఎల్ పోటీలను నిర్వహించు కోవచ్చని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్న వేళ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కడుపుమంట వ్యాఖ్యలు చేసింది.
టీ-20 వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉందని, మరో రెంచు నెలలు ఆగి, అప్పటి కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలిగానీ, తొందరపాటు నిర్ణయాలు ఎందుకని అభ్యంతర పెట్టింది. ఆ సమయంలో క్రికెట్ క్యాలెండర్ ప్రకారం, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు ఇంగ్లండ్ లో సిరీస్ ఆడే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసింది.
ఐపీఎల్ కేవలం ఓ దేశవాళీ టోర్నీ అని, దాన్ని బీసీసీఐ నిర్వహిస్తోందని, ఐసీసీ కాదని వ్యాఖ్యానించిన పీసీబీ ఉన్నతాధికారి, టీ-20 ప్రపంచ కప్ వాయిదా పడితే, ఆ సమయాన్ని ఐపీఎల్ కు కేటాయిస్తామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సీరీస్ లు, ఐసీసీ ఈవెంట్స్ స్థానంలో దేశీయ టోర్నీలను చొప్పించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. ఇక ఈ వ్యాఖ్యలను విన్న నెటిజన్లు, ప్రపంచ కప్ వాయిదా పడుతుందన్న బాధ కంటే, ఐపీఎల్ జరుగుతుందన్న కడుపుమంటే కనిపిస్తోందని అంటున్నారు.