Microsoft: జియోకు మరింత మహర్దశ... ఎంటరవుతున్న మైక్రోసాఫ్ట్!
- ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ కంపెనీల పెట్టుబడులు
- మైక్రోసాఫ్ట్ తో చర్చలు చివరి దశలో
- 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనున్న సంస్థ
- ఇప్పటికే పలు కంపెనీల నుంచి పెట్టుబడులు
ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్న జియో ప్లాట్ ఫామ్, ఇప్పుడు మరో భారీ డీల్ ను సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, జియోలో వాటా కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీల మధ్యా చర్చలు సాగుతుండగా, మరో భారీ డీల్ సిద్ధమైనట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ, సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్, జియో ప్లాట్ ఫామ్స్ లో 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుందని 'మింట్' వెల్లడించింది.
రెండు కంపెనీల మధ్యా చర్చలు చివరి దశకు చేరాయని, డీల్ గురించిన వివరాలు అతి త్వరలోనే వెల్లడి కానున్నాయని సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇండియాలో సత్య నాదెళ్ల పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ, ఇండియాలో తమ సంస్థను విస్తరించనున్నామని, క్లౌడ్ ఆధారిత సేవలపై కన్నేశామని ఆయన తెలిపారు. అప్పుడే ఈ డీల్ కు సంబంధించిన చర్చలు జరిగాయని, ముఖేష్ అంబానీ, సత్య నాదెళ్ల మాట్లాడుకున్నారని సమాచారం.
ఈ క్రమంలో తాజాగా బయటకు వచ్చిన వార్త టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే జియో ప్లాట్ ఫామ్స్ లో పలు ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ తోపాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ , కేకేఆర్ అండ్ కో, జనరల్ అట్లాంటిక్ వంటి కంపెనీల నుంచి రూ. 78,562 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ ఇప్పటికే జియోకు వచ్చింది.