YV Subba Reddy: ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి
- క్యూలైన్లు పరిశీలించిన టీటీడీ చైర్మన్
- ప్రభుత్వ అనుమతి వస్తే దర్శనాలు ప్రారంభిస్తామని వెల్లడి
- భక్తుల ఆరోగ్యానికి కీడు జరగకుండా చూస్తామన్న వైవీ
త్వరలోనే తిరుమల శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ సంకేతాలిస్తోంది. ఇవాళ, తిరుమల మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం, వెలుపలికి వెళ్లే మార్గం వరకు క్యూలైన్లను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్శనాల ప్రారంభానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోసం చూస్తున్నామని, ప్రభుత్వం ఆమోదం తెలిపితే భక్తుల ఆరోగ్యానికి హాని కలగని రీతిలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.