Daati Maharaj: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన స్వయం ప్రకటిత దేవుడు అరెస్ట్!
- దక్షిణ ఢిల్లీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన దాటి మహారాజ్
- కార్యక్రమం సందర్భంగా లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన
- విచారణ తర్వాత బెయిల్ పై విడుదల
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన స్వయం ప్రకటిత దేవుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న దాటి మహారాజ్ దక్షిణ ఢిల్లీలో ఓ ఆలయంలో మత పరమైన ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మహారాజ్ ను కొన్ని గంటల సేపు విచారించిన తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాటి మహరాజ్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దాటి మహారాజ్ అని తేలింది. దీంతో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.