Telangana: పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాకే బడులు.. దశల వారీగా తెరిచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం!
- జులై 5 తర్వాత మోగనున్న బడిగంట
- నేటి మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మంత్రి సబిత సమావేశం
- దశల వారీగా తరగతులు ప్రారంభించే యోచన
కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను మిగిలిన పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అంటే జులై 5 తర్వాత తెరవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అది కూడా దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తొలుత 8 నుంచి 10 తరగతులు ప్రారంభించాలని, ఈ సందర్భంగా లోపాలు బయటపడితే వాటిని సరిచేసిన అనంతరం మిగతా తరగతులను కూడా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేటి మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు, పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) వ్యూహాపత్రాన్ని రూపొందించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నిన్ననే దీనిపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మార్గదర్శకాల తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అలాగే, స్కూళ్ల పునః ప్రారంభంపై మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
విద్యాశాఖ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం.. తొలుత ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలను సన్నద్ధం చేస్తారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బడి నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తారు. అలాగే, తొలుత 8 నుంచి 10 తరగతులు ప్రారంభించాలి. ఆ తర్వాత కింది స్థాయి తరగతులను దశల వారీగా ప్రారంభించాలి. విద్యార్థుల మధ్య భౌతిక దూరం, ఇంటర్వెల్, లంచ్ ఒక్కో తరగతికి ఒక్కోలా ఉండాలి. అలాగే, స్కూలు ముగిసిన తర్వాత ఒక్కో తరగతి విద్యార్థులను కొంత వ్యవధి తర్వాత విడిచిపెట్టాలి. అలాగే, విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు తప్పనిసరని విద్యాశాఖ తన ప్రణాళికలో పేర్కొంది.