COVID-19: కరోనా టీకా అభివృద్ధిలో 30 బృందాలు.. ఏడాదిలోపే వ్యాక్సిన్: ప్రొఫెసర్ కె.విజయరాఘవన్
- ఏడాదిలోపే వ్యాక్సిన్ తీసుకురావాలంటే 300 బిలియన్ డాలర్ల ఖర్చు
- కోవిడ్ పరీక్ష కిట్లను తయారు చేస్తున్న 20 దేశీయ కంపెనీలు
- రోజుకు 5 లక్షల సామర్థ్యానికి చేరుకున్న భారత్
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో 30 బృందాలు తలమునకలై ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ కె.విజయరాఘవన్ తెలిపారు. ఏడాదిలోపే వ్యాక్సిన్ తయారీకి దేశం తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు. నిజానికి 10-15 ఏళ్లలో రూపొందించే వ్యాక్సిన్‌కు 200-300 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని, అదే ఏడాదిలోపే దానిని అందుబాటులోకి తీసుకురావాలంటే మాత్రం 200 నుంచి 300 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ మాట్లాడుతూ 20 స్వదేశీ కంపెనీలు కోవిడ్ పరీక్ష కిట్లను తయారుచేస్తున్నాయని అన్నారు. రోజుకు 5 లక్షల కిట్లు తయారు చేసే సామర్థ్యం ఇప్పుడు భారత్ సొంతమని అన్నారు. మన అవసరాలు తీరిన తర్వాత ప్రపంచానికి వాటిని అందిస్తామని వినోద్ పాల్ వివరించారు.