Hizbul Mujahideen: ఐఎస్ఐ - హిజ్బుల్ ముజాహిదీన్ మధ్య విభేదాలు... పాకిస్థాన్ లో హిజ్బుల్ చీఫ్ పై దాడి!
- సయ్యద్ సలావుద్దీన్ పై మే 25న దాడి
- దాడికి ప్లాన్ చేసింది ఐఎస్ఐ చీఫ్ అని అనుమానాలు
- తమ గీత దాటకూడదనే హెచ్చరికలో భాగంగానే దాడి అని సమాచారం
గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. మే 25న జరిగిన ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ కు చెందిన ఉన్నత స్థాయి వర్గాల ప్రకారం, ఈ దాడికి ప్లాన్ చేసింది ఐఎస్ఐ చీఫ్ అని తెలుస్తోంది.
ఐఎస్ఐకి, సలావుద్దీన్ కు మధ్య ఇటీవల వివాదం తలెత్తిందని, దాడికి ఇదే కారణమని సమాచారం. అయితే హిజ్బుల్ అధినేత ప్రాణాలు తీయడం దాడి లక్ష్యం కాదని... అతనికి తీవ్రమైన హెచ్చరికను ఇవ్వడమే టార్గెట్ అని తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే సలావుద్దీన్ సురక్షిత స్థావరానికి తరలి వెళ్లాడు.
హిజ్బుల్ ముజాహిదీన్ తో పాటు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే మరో ఉగ్ర సంస్థకు కూడా సలావుద్దీన్ అధినేతగా ఉన్నాడు. ఈ సంస్థలతో పాటు పాక్ నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్న పలు సంస్థలకు ఐఎస్ఐ స్పాన్సర్ చేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో హిజ్బుల్ కు ఐఎస్ఐ తగినంత సపోర్ట్ ఇవ్వడం లేదనే అసహనంతో సలావుద్దీన్ ఉన్నాడు. హిజ్బుల్ కేడర్ కు సరైన ట్రైనింగ్, ఆయుధాలను ఐఎస్ఐ ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహంతో ఉన్నాడు. ఇదే మొత్తం వివాదానికి కారణం అని తెలుస్తోంది.
కశ్మీర్ లో హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భారత బలగాలు హతమార్చిన తర్వాత... పాక్ ఆక్రమిత కశ్మీర్ లో హిజ్బుల్ కేడర్ తో సలావుద్దీన్ సమావేశమయ్యాడు. ఈ సందర్బంగా ఐఎస్ఐపై ఆయన బహిరంగ విమర్శలు గుప్పించాడు.
ఈ నేపథ్యంలో సలావుద్దీన్ పై దాడి జరిగిందని భావిస్తున్నారు. దాడికి ప్లాన్ చేసింది ఐఎస్ఐ అని పీవోకేలోని హిజ్బుల్ సీనియర్ కమాండర్ ఒకరు కూడా అభిప్రాయపడ్డాడు. తమ గీతను ఏ ఉగ్రసంస్థ దాటకూడదనే హెచ్చరికలో భాగంగానే ఈ దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.