Gudiwada Amarnath: బాధితులను పరామర్శించకుండా సొంత పనులు చూసుకుని హైదరాబాద్ వెళ్లారు: చంద్రబాబుపై గుడివాడ అమర్ నాథ్ విమర్శలు
- మహానాడు ముగిసిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ పయనం
- చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు వచ్చారన్న అమర్ నాథ్
- వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు అనంతరం హైదరాబాద్ పయనమైన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ శాసనసభ్యుడు గుడివాడ అమర్ నాథ్ ఘాటుగా స్పందించారు. అసలు చంద్రబాబు ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్లారు? అంటూ ప్రశ్నించారు.
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించేందుకు అనుమతి తీసుకుని రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు విశాఖకు రాకుండా ఎందుకు తిరిగి వెళ్లారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు గ్యాస్ బాధితులను పరామర్శించకుండా, సొంతపనులు చూసుకుని హైదరాబాద్ తిరిగి వెళ్లారని అమర్ నాథ్ ఆరోపించారు. హైదరాబాదులో ఉంటే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించాల్సి వస్తుందన్న కారణంతో ఇక్కడికి వచ్చారా? అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసినందుకు గుడివాడ అమర్ నాథ్ కు కూడా నోటీసులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, తనకు ఇంతవరకు నోటీసులు రాలేదని, మీడియా ద్వారానే తెలిసిందని, నోటీసులు వచ్చిన తర్వాత దీనిపై మాట్లాడతానని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంశంపై స్పందిస్తూ, న్యాయస్థానాలు అంటే తమకు గౌరవం ఉందని తెలిపారు. తీర్పులో ఏదైనా అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు వెళతామని వివరించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు.