KCR: ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కేసీఆర్ కీలక ఆదేశాలు
- ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయం
- వాస్తవానికి కొనుగోళ్లకు రేపే ముగింపు
- లాక్ డౌన్, వర్షాల కారణంగా గడుపు పొడిగింపు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు ఈరోజు ఆదేశాలను జారీ చేశారు.
వాస్తవానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రేపటి వరకే కొనసాగాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ కొనసాగుతుండటం, వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో... ధాన్యం సేకరణ కేంద్రాలను మరి కొన్ని రోజుల పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వర్షాలు రాకముందే రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముకోవాలని ఈ సందర్భంగా రైతులను కేసీఆర్ కోరారు.
మరోవైపు, తెలంగాణలో ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది పంట పండింది. పంటను అమ్ముకోవడం గురించి రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని, తుది గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇంతకు ముందే సీఎం ప్రకటించారు.