China: చైనా దూకుడు... డిసెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం!
- చైనాలో కరోనా వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు
- రెండో దశను దాటిన ప్రయోగాలు
- ఏడాదికి 120 మిలియన్ల డోసులు తయారుచేసేందుకు ప్రణాళిక
యావత్ మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నివారించే వ్యాక్సిన్ కోసం రేసులో చైనా దూసుకుపోతోంది. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ ను సిద్ధం చేయడమే కాదు, పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు తహతహలాడుతోంది. డిసెంబరు కల్లా చైనా తయారీ వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను బీజింగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్, నేషనల్ బయోటెక్ గ్రూప్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ రెండో దశ పరీక్షలు పూర్తయ్యాయి. ఏడాదికి 100 మిలియన్ల నుంచి 120 మిలియన్ల డోసులు తయారుచేయాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది.
మరే దేశంలోనూ లేని విధంగా చైనాలో ఐదు వ్యాక్సిన్లు సత్ఫలితాలను ఇస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వీటిని మానవులపై ప్రయోగిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ మార్కెట్ అవసరాలను, వాణిజ్యపరమైన గిరాకీని దృష్టిలో ఉంచుకున్న చైనా అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఇటు పరిశోధక సంస్థలను, ఔషధ నియంత్రణ వ్యవస్థలను పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు చైనా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు, చైనా అధినేత షి జిన్ పింగ్ తాము వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తే మాత్రం తప్పకుండా మిగతా దేశాలతో పంచుకుంటామని స్పష్టం చేశారు.