AG: స్వయంగా పదవిలోకి వచ్చిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేరు: అడ్వొకేట్ జనరల్

AG of Andhra Pradesh explains High Court verdict and after affects in Nimmagadda issue

  • హైకోర్టు తీర్పుపై వివరణ ఇచ్చిన అడ్వొకేట్ జనరల్
  • ప్రభుత్వ ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని వెల్లడి
  • వాహనాలు పంపాలంటూ నిమ్మగడ్డ సర్క్యులర్ ఇచ్చారన్న ఏజీ

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, తదనంతర పరిణామాలపై ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరాం వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని.. అందువలన  తనను తాను ఎస్ఈసీగా పునరుద్ధరించుకునట్టు రమేశ్ కుమార్ స్వయంగా ధ్రువీకరణ ఇచ్చారని, రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకున్నారని వెల్లడించారు. తనకు వాహనాలు పంపాలంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర అధికారులకు సర్క్యులర్ కూడా జారీ చేశారని తెలిపారు.

కానీ  రమేశ్ కుమార్ ను రీస్టోర్ చేయమని కోర్టు తన తీర్పులో  రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరిందని, అందువలన   తనకు తానుగా పదవిలోకి వచ్చినట్టు ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేరని ఏజీ వివరించారు.  హైకోర్టు తన  తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. తీర్పును అమలుచేయడానికి.. రాష్ట్రప్రభుత్వానికి  రెండు  నెలల కాలవ్యవధి ఉంటుంది అని తెలిపారు.

కోర్టు తీర్పు ప్రకారం.. ఎస్ఈసీని నిర్ణయించే వ్యవహారంలో కేవలం గవర్నర్ కే నిర్ణయాధికారం ఉంటుంది.. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర   ఉండదనుకొంటే, అదే నిబంధన నిమ్మగడ్డ నియామకానికి కూడా  వర్తిస్తుందని తెలిపారు. నిమ్మగడ్డను అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారని తెలిపారు.  అందువలన  నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం  చెల్లదని భావిస్తున్నామని తెలిపారు.

ఇక ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ....  ఇందులో తమకు కొన్ని సందేహాలున్నాయని అన్నారు. "రాష్ట్ర ఎన్నికల అధికారి అర్హతలను నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? ఒకవేళ ఉంటే, ఆ నిర్ణయాధికారాన్ని గవర్నర్ పరిశీలించే సమయంలో సీఎం సలహాను కానీ, మంత్రి మండలి సలహాను కానీ పాటించాల్సిన అవసరం ఉందా? అనేది మేం తెలుసుకోవాలనుకుంటున్నాం" అని తెలిపారు. ఈ విషయంలో స్పష్టత వస్తే తదుపరి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రీస్టోర్ చేయమని కోర్టు తన తీర్పులో  రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరిందని,  ఎస్ఈసీని నిర్ణయించే లేదా నియమించే  అధికారం రాష్ట్రానికి లేదు అన్నప్పుడు  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎస్ఈసీగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి  ఎలా నియమిస్తుందనే సందేహం  వస్తుందని... హైకోర్టు  తీర్పులోని ఈ అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళుతున్నామని తెలిపారు.

ఇక స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్ ను రాజీనామా చేయాలని నిమ్మగడ్డ కోరారని, ఇది చెల్లదని ఏజీ అన్నారు. తనకు కొంత సమయం కావాలని ప్రభాకర్ కోరినా, రేపటిలోగా రాజీనామా చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారని వివరించారు.

  • Loading...

More Telugu News