Iran: అమెరికాకు ఇరాన్ కఠిన హెచ్చరిక!
- అమెరికన్ల పక్కనే మా సైన్యం ఉంటుంది
- రక్షణ బలగాలను మరింత పటిష్ఠం చేస్తున్నాం
- నేవీ చీఫ్ రేర్ అడ్మిరల్ అలీరెజా తంగ్సిరి
తమను నిత్యమూ కవ్విస్తున్న అమెరికా చర్యలను ఇక ఉపేక్షించేది లేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఇరాన్ నేవీలో 110 యుద్ధ నౌకలు చేరిన సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో గార్డ్స్ నేవీ చీఫ్ రేర్ అడ్మిరల్ అలీరెజా తంగ్సిరి మాట్లాడుతూ, "అమెరికన్లు ఎక్కడైతే ఉంటారో.. వారి పక్కనే మా సైన్యం కూడా ఉంటుంది. గతంలో కంటే మరింత ఎక్కువగా వారు మా ఉనికిని ఆస్వాదిస్తారు" అన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మాట్లాడుతూ, తమ దేశ రక్షణ బలగాలను మరింత పటిష్ఠం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని, శత్రువుల సైన్యానికి ఇరాన్ ఎన్నడూ తలొగ్గదని అన్నారు. కాగా, ఇరాన్ నావికా దళంలో నూతనంగా అసుర- క్లాస్ స్పీడ్ బోట్స్, జోల్ఫాఘర్ కోస్టల్ పెట్రోలింగ్ బోట్లు, తారేఘ్ సబ్ మెరైన్లు వచ్చి చేరాయి.