Pawan Kalyan: లాక్ డౌన్ సమయంలో వేలాది ఇసుక లారీలు తిరిగాయి... ఇసుక మాత్రం డంపింగ్ యార్డ్ చేరలేదు: పవన్ కల్యాణ్
- నిర్మాణ రంగ కార్మికులతో పవన్ టెలీకాన్ఫరెన్స్
- కేంద్రం ఇచ్చిన నిధులు ఏంచేశారంటూ ప్రశ్నించిన జనసేనాని
- ఇసుక ఎటు వెళ్లిందంటూ వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భవన నిర్మాణ రంగ కార్మికులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఇప్పటి ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో వేలాదిగా ఇసుక లారీలు తిరిగాయని, కానీ ఇసుక మాత్రం డంపింగ్ యార్డ్ చేరలేదని అన్నారు. మరి ఆ ఇసుక అంతా ఏమైపోయిందని పవన్ ప్రశ్నించారు. ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుందని అన్నారు.
ఓవైపు ఇసుక కొరత, మరోవైపు కరోనాతో పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. లాక్ డౌన్ సమయంలో నిర్మాణ రంగ కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో వెల్లడించాలని పవన్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లిస్తున్నారని మండిపడ్డారు.