Telangana: తెలంగాణలో రాత్రంతా కురుస్తూనే ఉన్న వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి

Rains in Telangana for another two days

  • రాష్ట్రవ్యాప్తంగా 383 ప్రాంతాల్లో వర్షాలు
  • ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
  • నేడు, రేపు కూడా భారీ వర్షాలకు అవకాశం

తెలంగాణలో నిన్న ఉదయం ప్రారంభమైన వర్షం రాత్రంతా  కురుస్తూనే ఉంది. హైదరాబాద్‌లో మాత్రం నిన్న మధ్యాహ్నం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి ఒక్కసారిగా మేఘావృతమైంది. ఆ వెంటనే వర్షం కురిసి ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు బోల్డంత ఉపశమనం కలిగించింది.

ఉపరితల ద్రోణి కారణంగా నిన్న రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 382 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్టు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వానలు కురిశాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారంలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షం పడగా, ములుగు జిల్లా మంగపేటలో 9.8, పటాన్‌చెరులో 7.2, ఈసలతక్కళ్లపల్లిలో 7.2, మారేడుపల్లిలో 6.9, మల్యాలో 6.8, హయత్‌నగర్‌లో 6.7, దుమ్ముగూడెంలో 6.2, భద్రాచలంలో 6.1, జిన్నారంలో 5.5, కూకట్‌పల్లిలో 5.4, ఆరుట్లలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇక, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లం, నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని కుడికిల్లలో ఒకరు పిడుగుపాటుకు గురై మరణించారు. నేడు, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News