Telangana: తెలంగాణలో జులై 1 నుంచి మోగనున్న బడిగంట.. మార్గదర్శకాలు ఇవే!

Schools in Telangana will reopen from July 1st

  • జులై 1 నుంచి ఉన్నత పాఠశాలలు, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు
  • ఇక పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లకు కుదింపు  
  • ప్రాథమిక పాఠశాలలకు ఆది, సోమవారం సెలవు

తెలంగాణలో జులై 1 నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి కనుక లభిస్తే రాష్ట్రంలో వాటిని యథాతథంగా అమలు చేస్తారు.

విద్యాశాఖ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం.. జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు. ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు. ప్లే గ్రౌండ్‌లో ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి. 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే.  

అలాగే, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్‌ను 70 శాతానికి తగ్గిస్తారు. అలాగే, మొత్తం పనిదినాలను 150 రోజులకు తగ్గించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి మాత్రం ఒక్క ఆదివారం మాత్రమే సెలవు. అలాగే, పదో తరగతి పరీక్షలను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News