Donald Trump: వైట్ హౌస్ ముందు నిరసనలు పెచ్చుమీరగానే... బంకర్ లోకి వెళ్లిపోయిన ట్రంప్!
- నల్లజాతి యువకుడి హత్యపై నిరసన
- వైట్ హౌస్ వద్దకు నిరసనకారులురాగానే బంకర్ లోకి
- ట్రంప్ ను తరలించారన్న 'న్యూయార్క్ టైమ్స్'
అమెరికాలో నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు హత్య చేశారని ఆరోపిస్తున్న లక్షలాది మంది ప్రజలు, అతని మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ సాగిస్తున్న నిరసనలు వైట్ హౌస్ ను తాకగా, ఆ వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు జాగ్రత్త చర్యగా వైట్ హౌస్ కింద నిర్మించిన బంకర్ లోకి వెళ్లిపోయారని 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది.
శ్వేత సౌధం అధికారులు ఆయన్ను బంకర్ లోకి తరలించారని, దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసు అధికారులు నిరసనకారులను నిలువరించిన తరువాత ట్రంప్ మరలా బయటకు వచ్చారని పత్రిక పేర్కొంది. ఇదిలావుండగా, ట్రంప్ తో పాటు ఆయన కుటుంబీకులైన మెలానియా, బారన్ తదితరులను కూడా బంకర్ లోకి తరలించారా? అన్న విషయంపై స్పష్టత లేదు.