Mallu Bhatti Vikramarka: తెలంగాణలో వర్సిటీలను కాపాడాలంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన భట్టి
- గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు
- కుట్రపూరితంగా వర్సిటీలను నాశనం చేస్తున్నారని ఆరోపణ
- పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన
తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వర్సిటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని, తద్వారా ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ యూనివర్సిటీలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని, ఇప్పుడవి లేకపోతే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతవిద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ, ఉస్మానియా వర్సిటీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు.