Nimmagadda Ramesh: నిమ్మగడ్డ విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
- హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
- సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
- రేపు ఢిల్లీకి వెళ్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలాన్ని కుదించి, కనగరాజును ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. హైకోర్టు తీర్పులోని అభ్యంతరాలను ఈ పిటిషన్ లో ప్రభుత్వం లేవనెత్తింది. ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని... ఆ అధికారంతోనే కనగరాజును నియమించామని ఏపీ ప్రభుత్వం చెపుతోంది. మరోవైపు, ఈ పిటిషన్ రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలావుంచితే, ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అలాగే రమేశ్ కుమార్ పిటిషన్ పై న్యాయ నిపుణులతో సమావేశమవుతారని సమాచారం.