Kajal Agarwal: ఎత్తులకు పైఎత్తులు వేస్తానంటున్న కాజల్!
- చదరంగం మీద దృష్టి పెట్టిన కాజల్
- ఆన్ లైన్ లో ఆట నేర్చుకుందట
- ఆట పట్టు తెలిసిందన్న ముద్దుగుమ్మ
- భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నానన్న కాజల్
కరోనా మూలంగా విధించిన లాక్ డౌన్ అందర్నీ ఇంటిలో బందీ చేసింది. దాంతో చాలామంది ఈ ఖాళీ సమయంలో ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటూనో.. లేక బుక్స్ చదువుతూనో సద్వినియోగం చేసుకున్నారు. ఇక అందాలతార కాజల్ అగర్వాల్ అయితే, చదరంగం ఆటపై దృష్టి పెట్టిందట.
"ఇంతకుముందు చెస్ ఆట గురించి కొద్దిగా తెలుసు కానీ, పూర్తిగా తెలియదు. అందుకే, ఈ ఆట నేర్చుకోవాలని నిర్ణయించుకుని ఆన్ లైన్ లో నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ ఆటపై పూర్తి పట్టు వచ్చింది. ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో తెలిసింది.ఈ చెస్ వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకే, దీని మీద దృష్టి పెట్టాను' అని చెప్పింది.
అలాగే, ఎక్కువసేపు ఆధ్యాత్మికంగా కూడా గడిపిందట. 'మనసును ఆహ్లాదంగా ఉంచుకోవడం కోసం ఆధ్యాత్మిక విషయాలపై కేంద్రీకరించాను. ఇంట్లో వాళ్లని అడిగి మన పురాణ కథల్ని బాగా తెలుసుకున్నాను. మా అమ్మమ్మ భాగవతం బాగా చెబుతుంది. అవన్నీ శ్రద్ధగా విన్నాను. అలాగే, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని కంఠతా కూడా వచ్చాయి. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో దూరదర్శన్ లో రామాయణ్, మహాభారత్ సీరియల్స్ ను మళ్లీ ప్రసారం చేయడం ఆనందాన్నిచ్చింది. ఇలా ఈ ఖాళీ సమయంలో మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించాను' అని చెప్పింది కాజల్. మొత్తానికి ఈ చిన్నది లాక్ డౌన్ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకుందన్న మాట!