Budda Venkanna: విజయసాయిరెడ్డిని వైకాపాలోనే ఉంటావా అని అడిగింది ఎవరు?: బుద్ధా వెంకన్న
- విశాఖలో విజయసాయి ప్రెస్ మీట్ చూశాక అతనిపై జాలేస్తుంది
- విజయసాయి కాస్తా విఫలసాయిలా పేలవంగా మాట్లాడుతున్నారు
- ఎవరూ అడగకుండానే చచ్చేవరకూ వైకాపాలోనే ఉంటానన్నారు
- అనడానికి కారణం ఏంటీ?
ఏపీ సీఎం, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తనను పక్కన పెట్టారంటూ దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. తాను చివరి వరకు జగన్ తోనే ఉంటానని ఆయన అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ చురకలంటించారు.
'విశాఖలో విజయసాయి ప్రెస్ మీట్ చూసిన తరువాత అతని పై జాలేస్తుంది. విజయసాయి కాస్తా విఫలసాయిలా పేలవంగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ చూసిన తరువాత నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి? విజయసాయిరెడ్డిని వైకాపా లోనే ఉంటావా అని అడిగింది ఎవరు?' అని ప్రశ్నించారు.
'ఎవరూ అడగకుండానే ఆయన చచ్చేవరకూ వైకాపాలోనే ఉంటా అనడానికి కారణం ఏంటీ? పార్టీ లో తలెత్తిన అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు వల్లనే ఆయన బయటకు వచ్చి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది' అన్నారు బుద్ధా వెంకన్న.
'కారులోంచి దించేసిన తరువాత విజయసాయి ప్రవర్తనలో ఎంతో మార్పు కనపడుతుంది. పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకప్పుడు ఢిల్లీ మొత్తం నాదే , విశాఖలో చీమ చిటుక్కుమన్నా దాని వెనుక నేనే ఉన్నాను అన్న విజయసాయి ఇప్పుడు కేవలం సోషల్ మీడియా వ్యవహారాలు మాత్రమే చూస్తానని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.