Aadhar Card: జేబులో ఆధార్ కార్డు లేకపోతే క్షవరం కుదరదు... తమిళనాడులో అధికారిక ఉత్తర్వులు
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం
- సెలూన్లలో కస్టమర్ల వివరాలు నమోదు
- పేరు, ఫోన్ నెంబరుతో పాటు ఆధార్ నెంబర్ సైతం నమోదు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డును సెలూన్లకు కూడా వర్తింపజేస్తోంది. బ్యాంకు అకౌంట్లు, ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడే ఆధార్ కార్డు ఇప్పుడు క్షవరం చేయించుకునేందుకు కూడా ఉపయోగపడనుంది. ఎందుకంటే, ఇకపై తమిళనాడులోని సెలూన్లలో ఆధార్ కార్డు లేకపోతే క్షవరం చేయరు. సెలూన్లకు వెళ్లే వారు విధిగా తమ వెంట ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిందే.
ఇక సెలూన్ నిర్వాహకులు కూడా తప్పనిసరిగా ఓ రిజిస్టర్ లో కస్టమర్ల వివరాలు నమోదు చేయాలి. పేరు, ఫోన్ నెంబర్ మాత్రమే కాదు, ఆధార్ కార్డు వివరాలన్నీ ఆ రిజిస్టర్ లో పొందుపరచాలట. అంతేకాదు, సెలూన్ నిర్వాహకులు కస్టమర్ల ఫోన్ లో ఆరోగ్య సేతు యాప్ స్టేటస్ ను పరిశీలించాల్సి ఉంటుంది. ఫోన్ లో సేఫ్ అని చూపిస్తేనే క్షవరం చేయాలి. సెలూన్ లో ఏసీ నిలిపివేయాలి. కస్టమర్లు రాగానే శానిటైజ్ చేయాలి. మాస్కుల వాడకం తప్పనిసరి చేశారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.