Jessica Lal: తీహార్ జైలు నుంచి విడుదలైన జెస్సికా లాల్ హంతకుడు మను శర్మ!

Jessica Lal killer Manu Sharma released from Tihar Jail

  • 1999లో జెస్సికా లాల్ ను హత్య చేసిన మను శర్మ
  • 17 ఏళ్ల నుంచి జైలు జీవితం గడుపుతున్న వైనం
  • సత్ప్రవర్తన కారణాలతో విడుదల

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన జెస్సికా లాల్ హంతకుడు మను శర్మ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. సత్ప్రవర్తన కారణాలతో మను శర్మతో పాటు మరో 18 మందిని విడుదల చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో భాగమైన 'ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డ్' పంపిన నివేదికపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సంతకం చేశారు. ఢిల్లీ హోం మంత్రి సత్యేందర్ జైన్ అధ్యక్షతన గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో శర్మను విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

43 ఏళ్ల మను శర్మ ఇప్పటికే  17 ఏళ్ల పాటు జైల్లో గడిపాడు. కరోనా నేపథ్యంలో ఇటీవలే అతను పెరోల్ మీద విడుదలయ్యాడు. ప్రైవేట్ బారులో పని చేస్తున్న మోడల్ జెస్సికా లాల్ ను 1999లో మను శర్మ అత్యంత పాశవికంగా హత్య చేశాడు. సమయం మించి పోయిన కారణంగా తనకు మద్యం సర్వ్ చేసేందుకు ఆమె నిరాకరించడంతో... ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపాడు. నేరం నిరూపితం కాలేదంటూ ట్రయిల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తడంతో కేసు హైకోర్టుకి వెళ్లింది. విచారణ తర్వాత హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేస్తూ, అతనిని దోషిగా ప్రకటించి, యావజ్జీవ శిక్ష విధించింది. అనంతరం 2010లో సుప్రీంకోర్టు కూడా దీనిని ఖరారు చేసింది.

జైల్లో మను శర్మ సత్ప్రవర్తనతో మెలుగుతున్న కారణంగా రెండేళ్ల క్రితం అతనిని ఓపెన్ జైలుకి పంపించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయటకు వెళ్లి పని చేసేందుకు ఆయనకు అవకాశం లభించింది. దీంతో, ఖైదీల పునరావాస కేంద్రంలో ఆయన పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, మను శర్మలో మార్పు వచ్చిందని... అతడిని విడుదల చేస్తే తమకు అభ్యంతరం లేదని, అతడిని తాను క్షమిస్తున్నానని జెస్సికా సోదరి జైళ్ల శాఖకు లేఖ రాశారు.

ఈ క్రమంలో తనను విడుదల చేయాలంటూ రెండేళ్ల క్రితం ఆయన చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. అయితే అనేక పరిణామాల తర్వాత ఆయనను విడుదల చేయాలని సెంటెన్స్ రివ్యూ బోర్డు నిర్ణయించింది. దీంతో, మూడేళ్ల ముందే ఆయన జైలు నుంచి విడుదల అయ్యాడు. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడే మను శర్మ అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News