Prashant Kishor: తమను గెలిపించాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించిన ప్రశాంత్ కిశోర్!
- పలు పార్టీలను గెలుపు తీరాలకు చేర్చిన ప్రశాంత్ కిశోర్
- ఉప ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరిన కాంగ్రెస్
- ముక్కలుగా జరిగే ఎన్నికలు తనకొద్దని వెల్లడి
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... ఈ పేరు చెబితేనే రాజకీయ పార్టీల్లో వణుకు మొదలవుతుంది. తనతో డీల్ కుదుర్చుకుంటే, ప్రత్యర్థి పార్టీలు ఎంతటివైనా ఎన్నికల్లో విజయం సాధించేలా వ్యూహాలు పన్ని, వాటిని స్వయంగా అమలు చేసి, గెలుపు తీరాలకు చేర్చడం ఆయనకు మాత్రమే సాధ్యం. ఈ విషయాన్ని ఏ పార్టీ వారైనా అంగీకరిస్తారు. 2014లో బీజేపీకి తోడుండడం నుంచి, ఆపై ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడం వరకూ, ఆయన రంగంలోకి దిగిన ఎన్నికల్లో చాలావాటిల్లో తనను నమ్ముకున్న వారిని గెలిపించే వ్యూహాలు పన్నారు.
తాజాగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ను కాదన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా 'ఎన్డీటీవీ'కి వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో త్వరలో 24 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగనుండగా, తమను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సహకరించాలని కాంగ్రెస్ కోరగా, ప్రశాంత్ కిశోర్ దాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ కు విధేయుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింథియా, తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీని వీడిపోయిన సంగతి తెలిసిందే.
"తనకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్ నాథ్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో సహకరించాలని కోరారు. నేను అంగీకరించలేదు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను" అని అన్నారు.
కాగా, 2014 ఎన్నికల తరువాత అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బీజేపీకి దూరమై, వివిధ రాష్ట్రాల్లో తన వ్యూహాలను అమలు చేస్తూ, తనను నమ్ముకున్న పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. తదుపరి జరిగే ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ తో ఇప్పటికే డీల్ కుదుర్చుకుని తన వ్యూహాలను అమలు చేస్తున్నారు.