Palladium: 'కేజీఎఫ్'లో బంగారాన్ని మించిన లోహ నిక్షేపాలు... వెలికితీతపై త్వరలోనే నిర్ణయం!
- కోలార్ జిల్లా వాసులకు తీపి కబురు త్వరలోనే
- పల్లాడియంను వెలికి తీసే పనులు పీపీఈ విధానంలో
- వెల్లడించిన ఎంపీ మునిస్వామి
ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కర్ణాటక పరిధిలో విస్తరించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్)లో బంగారానికి మించిన విలువైన లోహ నిక్షేపాలు ఉన్నాయని, వీటి వెలికితీతపై త్వరలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర ఎంపీ మునిస్వామి వెల్లడించారు. ఇక్కడి గనుల్లో పల్లాడియం ఉందని, దాని వెలికితీతకు నిర్ణయం తీసుకుంటే, అది కోలార్ జిల్లా వాసులకు తీపి కబురు అవుతుందని ఆయన అన్నారు.
తాజాగా బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేజీఎఫ్ పరిధిలోని బీజిఎంఎల్ బంగారం గనుల ప్రాంతంలోనే పల్లాడియం లోహముందని తెలిపారు. ఇందుకు సంబంధించి గతంలోనే గని కార్మికులను తాను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లి మాట్లాడానని మునిస్వామి వెల్లడించారు. ఆ వెంటనే స్పందించిన ప్రధాని, గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయగా, వారు ఈ ప్రాంతాన్ని సందర్శించి, పల్లాడియం ఉందని తేల్చారని అన్నారు. పీపీఈ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానంలో గనుల్లో వెలికితీత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
కాగా, ప్లాటినం కుటుంబానికి చెందిన పల్లాడియం వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది. బంగారంతో పోలిస్తే, తక్కువ ఉష్ణోగ్రతకే కరిగిపోతుంది. ప్రపంచంలో ఇది చాలా అరుదుగా లభిస్తుంది. కార్ల ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ విభాగాలు, ఆభరణాలు తదితరాల్లో దీన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ లోహం రష్యా, సౌతాఫ్రికా దేశాల్లో లభిస్తున్నా, డిమాండ్ కు తగినంత లేదు. దీని ధర బంగారం, ప్లాటినం కన్నా అధికంగా ఉంటుంది.