Liquor: కర్ణాటక నుంచి మద్యం తెస్తూ పట్టుబడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు!
- బండి హులికుంటప్ప కుమారుడు విక్రమ్
- మద్యం తెస్తుండగా పట్టుకున్న రాయదుర్గం ఎక్సైజ్ పోలీసులు
- కేసు వద్దని పై స్థాయిలో ఒత్తిడి
రాయదుర్గం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప కుమారుడు విక్రమ్ కుమార్ అలియాస్ విక్కీ, కర్ణాటక నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ లోకి భారీ ఎత్తున మద్యం తరలిస్తూ, పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే, గత నెల 30న 'కేఏ 34 ఏ 5856' నంబర్ గల టాటా ఏస్ వాహనంలో 624 కర్ణాటక మద్యం బాటిళ్లతో విక్రమ్ వస్తుండగా, రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డులో గల ఎక్సైజ్ చెక్‌పోస్టులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ధనుంజయ పట్టుకున్నారు. విక్రమ్ తో పాటు వాహన యజమాని మహమ్మద్ అన్సర్, ఆసిఫ్, విశాల్ రాజ్ మహార్ లను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, వీరు తరచూ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారని తమ విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరిపై కేసు నమోదు చేయవద్దని పై స్థాయిలో వత్తిళ్లు వచ్చినట్టు సమాచారం.