Kala Venkatrao: దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మంగారు చెపితే ఎవరి గురించో అనుకున్నాం.. ఇప్పుడు అర్థమైంది: కళా వెంకట్రావు

Jagan govt is looting the state says Kala Venkatrao

  • జగన్, వైసీపీ నేతల గురించి బ్రహ్మంగారు చెప్పారు
  • పంచభూతాలను వైసీపీ నేతలు పంచుకుంటున్నారు
  • రీచ్ లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండానే మాయమవుతోంది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగలు పాలకులు అవుతారని పోతులూరి వీరబ్రహ్మంగారు చెపితే ఎవరో అనుకున్నామని... కానీ, ఆయన చెప్పింది జగన్, వైసీపీ నేతల గురించి అని అర్థమయిందని అన్నారు.

జనాలకు నవరత్నాలను పంచుతామని చెప్పి... పంచభూతాలను వైసీపీ నేతలు పంచుకుంటున్నారని విమర్శించారు. చివరకు ఇసుక, మట్టిని కూడా వదలకుండా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చామని... ఇప్పుడు వైసీపీ నేతలకు కమిషన్లు ఇస్తే తప్ప ఇసుక దొరికే పరిస్థితి లేదని అన్నారు. రీచ్ లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండానే మధ్యలో మాయమవుతోందని సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

టీడీపీ హయాంలో లారీ ఇసుక రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు ఉండేదని... ఇప్పుడు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. ఇసుక కొనలేక పేదలు మధ్యలోనే ఇళ్ల నిర్మాణాలను ఆపేసి, మొండి గోడల్లో తలదాచుకుంటున్నారని అన్నారు. సామాన్యులకు ఇసుక పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... లేకపోతే ఇసుక తుపానులో ప్రభుత్వం కొట్టుకు పోవడం ఖాయమని  చెప్పారు. దళితులపై  వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనని... ఇలాంటి చర్యలను మానుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News