Pope Francis: అమెరికాలో జాతీయ సయోధ్యకు పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్
- ఫ్లాయిడ్ మృతి విచారకరం
- అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నా
- హింస ద్వారా ఏదీ సాధించలేం
నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఫ్లాయిడ్ మృతి విచారకరమని అన్నారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితులు తనను ఎంతో ఆవేదనకు గురిచేశాయన్న పోప్.. ఫ్లాయిడ్‌తోపాటు మరణించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థనలు చేస్తున్నట్టు తెలిపారు. జాత్యహంకారం భరించలేనిదని అన్నారు.
జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా పెల్లుబికిన ఆందోళనలు, విధ్వంసంపై మాట్లాడుతూ.. హింస ద్వారా ఏదీ సాధించలేకపోగా, ఎంతో పోగొట్టుకున్నామన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అమెరికాలో జాతీయ సయోధ్యకు పోప్ పిలుపునిచ్చారు. జాతీయ సయోధ్య, శాంతి కోసం దేవుణ్ని ప్రార్థించాలని అమెరికన్లను కోరారు. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత అమెరికా వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.