pothula sunitha: టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హత పిటిషన్‌పై విచారణ.. డుమ్మా కొట్టిన శివనాథరెడ్డి, పోతుల సునీత
- సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులకు అనుకూలంగా ఓటు
- అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్‌కు టీడీపీ ఫిర్యాదు
- హాజరై వాదనలు వినిపించిన బుద్ధా వెంకన్న, అశోక్ బాబు
పార్టీ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్‌బాబులు చేసిన ఫిర్యాదుపై నేడు శాసనమండలిలో విచారణ జరిగింది. మండలి చైర్మన్ షరీఫ్ ఆదేశాల మేరకు హాజరైన బుద్ధా వెంకన్న, అశోక్‌బాబులు తమ వాదన వినిపించారు. అయితే, ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, సునీత మాత్రం విచారణకు హాజరు కాలేదు.
కొన్ని కారణాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నామని వారు చైర్మన్‌కు తెలియజేశారు. దీంతో సాకులు చెబుతూ విచారణకు హాజరు కాని ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని చైర్మన్ షరీఫ్‌ను బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి జరిగిన ఓటింగులో పాల్గొన్న శివనాథరెడ్డి, పోతుల సునీతలు పార్టీ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు.