India: ఇండియా పేరును మార్చాలన్న పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!
- ఇండియా పేరును భారత్ లేదా హిందుస్థాన్ గా మార్చాలని పిటిషన్
- ప్రతిపాదనను కేంద్రానికి అందజేయాలని సూచించిన సుప్రీంకోర్టు
- ఇందులో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్య
ఇండియా పేరును భారత్ గా మార్చాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను అందజేయాలని సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమహ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇండియా పేరును భారత్ లేదా హిందుస్థాన్ గా మార్చాలని కోరారు. ఇండియా పేరును మార్చడం వల్ల పరాయి పాలనను ప్రజలు మర్చిపోయేలా చేయొచ్చని, భారత జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చని పేర్కొన్నారు.
పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఇండియాను ఇప్పటికే భారత్ అని సంబోధిస్తున్నారని... అయినా, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్ కాపీని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని... ప్రభుత్వమే దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. మరోవైపు 2016లో కూడా ఇండియా పేరు మార్చాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. అప్పుడు కూడా పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.