Students: మాకూ ఎగ్జామ్స్ వద్దు... ఏపీ, టీఎస్ విద్యార్థుల సోషల్ మీడియా ప్రచారం!

Students demanding to Cancel Exams

  • వైరల్ అవుతున్న ప్రమోట్ స్టూడెంట్స్ సేవ్ ఫ్యూచర్స్' హ్యాష్ ట్యాగ్ 
  • ప్రభుత్వాలు చేస్తున్న ఏర్పాట్లు ధైర్యాన్ని పెంచేలా లేవు
  • పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యమంటున్న విద్యార్థులు

కర్ణాటక విద్యార్థులను అనుసరిస్తూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్ చేయాలంటూ 'ప్రమోట్ స్టూడెంట్స్ సేవ్ ఫ్యూచర్స్' హ్యాష్ ట్యాగ్ తో తమకు ఎగ్జామ్స్ వద్దని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న కర్ణాటక విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి తమకు కూడా పరీక్షలొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కూడా అనుసరిస్తూ తమకూ పరీక్షలు వద్దంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లను చేస్తున్న సమయంలో, ఆ ఏర్పాట్లు తమలో ధైర్యాన్ని పెంచడం లేదన్నది విద్యార్థుల అభిప్రాయం. తమకు వైరస్ సోకవచ్చన్న భయాందోళనలతో ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేమని అంటున్నారు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వాలు మాత్రం ఇంతవరకూ స్పందించ లేదు.

"భవిష్యత్తులో సాధించాల్సిన విజయం గురించి ఆలోచించాల్సిన సమయం కాదిది. అసలు భవిష్యత్తే ఉంటుందా? ఉండదా? అని యోచించాల్సిన పరిస్థితి" అని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్షలు ముఖ్యం కాదని, మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకుని అన్ని పరీక్షలనూ రద్దు చేయాలని మరో విద్యార్థి కోరాడు.

కాగా, కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో విద్యారంగం కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసుల విధానంలోకి మారాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించగా, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ సైతం అదే నిర్ణయాన్ని తీసుకుంది. మరోపక్క, ఆన్ లైన్ క్లాసులు యువత మనస్సులను ప్రభావితం చేయలేవని ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ సీఎన్ఆర్ రావు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News