parrots: పంజరం శుభ్రం చేస్తుండగా ఎగిరిపోయిన ఖరీదైన చిలుకలు.. చిన్నారిని కొట్టి చంపేసిన యజమాని!
- నాలుగు నెలల క్రితమే పనిలో చేరిన చిన్నారి
- భార్యతో కలిసి బాలికను చావబాదిన యజమాని
- వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్
పాకిస్థాన్‌లోని రావల్పిండిలో దారుణం జరిగింది. చిలుకలను వదిలేసిందన్న కారణంగా ఎనిమిదేళ్ల చిన్నారిపై యజమాని ప్రతాపం చూపించాడు. విచక్షణ మరిచి చావబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని చిన్నారి ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే చనిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. పక్షుల, జంతువుల క్రయవిక్రయాలు నిర్వహించే ఓ వ్యాపారి ఇంట్లో 8 ఏళ్ల బాలిక జాహ్రా నాలుగు నెలల క్రితం పనిలో చేరింది. ఆదివారం ఆమె పంజరాలను శుభ్రం చేస్తుండగా అందులో ఉన్న ఖరీదైన చిలుకలు ఎగిరిపోయాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారి, అతడి భార్య చిన్నారిపై దాడిచేశారు.
విచక్షణ రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన బాలికను బేగం అక్తర్ రుక్సానా మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత కాసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. జాహ్రా మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వ్యాపారి, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై దాడిచేసినట్టు వారు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను జూన్ ఆరో తేదీ వరకు కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారిని పొట్టనపెట్టుకున్న వ్యాపారి, అతడి భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.