India: కరోనా అప్ డేట్... ఢిపెన్స్ సెక్రెటరీకి పాజిటివ్!
- రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా
- హోమ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్స
- ప్రపంచవ్యాప్తంగా 64,30,705 కేసులు
ఇండియాలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తున్న వేళ, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు వైరస్ సోకింది. స్వల్ప జ్వరంతో ఆయన బాధపడుతూ ఉండగా, ఆయనకు పరీక్ష చేసిన వైద్యులు వైరస్ సోకిందని తేల్చారు. ప్రస్తుతం ఆయన్ను హోమ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.
కాగా, వలస కార్మికుల తరలింపు దాదాపు రెండు నెలల క్రితం ప్రారంభంకాగా, ఇప్పటివరకూ వలస కార్మికులకు జరిపిన పరీక్షల్లో కేవలం 3 శాతం మందికి మాత్రమే వైరస్ సోకినట్టు తేలిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఇక కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన మనసును మార్చుకుంది. ట్రయల్స్ లో హెచ్సీక్యూ ఔషధాన్ని వాడవచ్చని ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, ఇప్పటివరకూ 64,30,705 కేసులు నమోదుకాగా, 3,85,947 మంది కన్నుమూశారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశమైన అమెరికాలో 18,51,520 కేసులుండగా, 1.07 లక్షల మందికి పైగా మరణించారు.