Donald Trump: బంకర్ లోకి వెళ్లడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్
- జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అట్టుడుకుతున్న అమెరికా
- వైట్ హౌస్ ఎదుట నిరసనలు
- ట్రంప్ ను బంకర్ లోకి తరలించిన భద్రతా సిబ్బంది
- బంకర్ ను పరిశీలించడానికి వెళ్లానన్న ట్రంప్
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగుల్చుతున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట కూడా నిరసన జ్వాలలు చెలరేగడంతో ఆ సెగలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా తాకాయి.
దాంతో భద్రత కారణాల రీత్యా ట్రంప్ ను అధికారులు వైట్ హౌస్ లో ఉన్న హైసెక్యూరిటీ బంకర్ కు తరలించారు. దాంతో ట్రంప్ దాక్కున్నాడంటూ పలు కథనాలు వచ్చాయి. తాజాగా, ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు. తాను బంకర్ లో దాక్కున్నట్టు వచ్చిన వార్తలను చూశానని, వాస్తవానికి తాను బంకర్ ను పరిశీలించడానికి మాత్రమే వెళ్లానని తెలిపారు. తాను అక్కడ గడిపింది కాసేపేనని పేర్కొన్నారు.
గతంలోనే అనేక పర్యాయాలు బంకర్ లోకి వెళ్లానని, అదేమంత ముఖ్య విషయం కాదని, ఎవరైనా తన సమీపంలోకి వచ్చినా భయపడబోనని ధీమా వ్యక్తం చేశారు. కాగా, వైట్ హౌస్ లోని బంకర్ ఏవైపు ఉంటుందనేది అత్యంత రహస్యం! అతి కొద్ది మంది సైనిక, సీక్రెట్ సర్వీస్ అధికారులు దీన్ని పర్యవేక్షిస్తుంటారు.