Tablighi Jamaat: 2,550 మంది తబ్లిగీ జమాత్ కార్యకర్తలు దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం
- పదేళ్ల పాటు నిషేధం
- ఇటీవల ఢిల్లీలో మర్కజ్ నిర్వహణ
- వీసా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన తబ్లిగీలు
తబ్లిగీ జమాత్... ఇటీవల కరోనా వైరస్ ముడిపడి ఈ పేరు ఎక్కువగా వినిపించింది. ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న తబ్లిగీ జమాత్ కార్యకర్తలు ఆపై దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో కరోనా వ్యాప్తి ఎక్కువైందని కథనాలు వినిపించాయి.
కాగా, పెద్ద ఎత్తున విదేశీ తబ్లిగీలు టూరిస్టు వీసాలపై భారత్ వచ్చి ఢిల్లీలో మర్కజ్ లో పాల్గొనగా, వీరిలో చాలామంది వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలుసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠినచర్యలకు ఉపక్రమించింది. సుమారు 2,550 మందిని బ్లాక్ లిస్టులో పెట్టిన కేంద్రం, వారిని పదేళ్ల పాటు భారత్ లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. తబ్లిగీ జమాత్ కేసుతో సంబంధం ఉన్న 541 మంది విదేశీయులపై ఢిల్లీ పోలీసులు 12 తాజా ఛార్జిషీట్లు దాఖలు చేసిన తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.