Ravi Kota: తెలుగు ఐఏఎస్ అధికారికి అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం
- అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా నియామకం
- భారత ఎంబసీలో సంయుక్త కార్యదర్శి హోదా
- మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న రవి కోట
శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అసోం క్యాడర్ లో తన ప్రస్థానం ఆరంభించి అంచెలంచెలుగా గుర్తింపు సంపాదించుకున్న రవి కోట ఇప్పుడు అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా, రవి కోట వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో వ్యవహరించనున్నారు. తన విధుల్లో భాగంగా భారత్ తరఫున ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి), వరల్డ్ బ్యాంకు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. రవి కోట మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.