Security guard: చైనాలో దారుణం.. పాఠశాలలోకి చొరబడి కత్తితో హల్‌చల్ చేసిన సెక్యూరిటీ గార్డు.. 39 మందికి గాయాలు!
- గాంగ్జీ ప్రావిన్స్‌లో ఘటన
- ప్రిన్సిపాల్, ఓ విద్యార్థి పరిస్థితి విషమం
- నిందితుడు అదే పాఠశాలలో సెక్యూరిటీ గార్డు!
చైనాలో దారుణం జరిగింది. ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన సెక్యూరిటీ గార్డు తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 39 మంది గాయపడ్డారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నారు. గాంగ్జీ ప్రావిన్స్‌లో నిన్న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో వూజోలోని ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన సెక్యూరిటీ గార్డు విద్యార్థులు, ఉపాధ్యాయులపై కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు.
అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్, ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. నిందితుడైన 50 ఏళ్ల సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. అతడు అదే స్కూలులో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దాడికి గల కారణాలు తెలియరాలేదు.