Temples: దేవాలయాలకు కొత్త రూల్స్... తీర్థ ప్రసాదాలు, భజనలకు నో చెప్పిన కేంద్రం!

New Rules for Temples No Holy Water and Prasadams
  • మరో మూడు రోజుల్లో తెరచుకోనున్న ఆలయాలు
  • కొత్త విధి విధానాలు విడుదల చేసిన కేంద్రం
  • నిబంధనలకు అనుగుణంగా దర్శనాలకు ఏర్పాట్లు
మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరచుకోనున్న వేళ, ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతూ ఉండటాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం, భక్తుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం, స్వీకరించడం, తీర్థం తీసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అందరూ కలిసి ఆలయాల్లో భజనలు చేయడాన్ని కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. భజన గీతాలను కేవలం రికార్డుల ద్వారా మైకుల నుంచి మాత్రమే వినిపించాలని ఆదేశించింది.

దక్షిణాదిన శబరిమల, తిరుమల నుంచి ఉత్తరాదిన వైష్ణోదేవి ఆలయాల్లో లాక్ డౌన్ ప్రారంభం నుంచి భక్తులను అనుమతించని సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ దేవాలయాల్లో అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 8వ తేదీ తరువాత దేవాలయాలు తెరిచేందుకు అనుమతి రావడంతో, ఇప్పటికే చాలా ప్రముఖ ఆలయాలు ఏర్పాట్లను పూర్తి చేయగా, మరికొన్ని మరింత స్పష్టమైన విధి విధానాల కోసం వేచి చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గురువారం నాడు కేంద్రం కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. దేవాలయాలలోకి భక్తులు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు విడివిడిగా ద్వారాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక్కొక్కరి మధ్యా కనీసం 6 అడుగుల దూరం తప్పనిసరిగా ఉండాలని సూచించింది. ఆలయంలోకి వెళ్లే ముందు భక్తులు విధిగా చేతులను, కాళ్లను సబ్బుతో కడుక్కోవాలని, ప్రార్థనా స్థలాల్లో భక్తులు కూర్చునే చాపలను ఎవరికి వారే తెచ్చుకోవాలని పేర్కొంది. దేవతా విగ్రహాలు, అక్కడి గోడలపై ఉండే శిల్పాలను తాకేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
Temples
Prasad
Holy Water
Bhajans
New Rules

More Telugu News