TTD: ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం: టీటీడీ

TTD set to restart Tirumala temple in a few days

  • ఈ నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ప్రయోగాత్మక దర్శనాలు
  • వీఐపీ దర్శనాలకు గంట సమయం
  • శ్రీవారి మెట్ల మార్గం మూసివేత

శ్రీవారి దర్శనాల పునరుద్ధరణకు టీటీడీ సన్నద్ధమవుతోంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో భక్తులకు అనుమతి నిరాకరించడంతో తిరుమల క్షేత్రం బోసిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ప్రకటించడంతో ఈ నెల 11 నుంచి దేశవ్యాప్త భక్తులకు శ్రీవారి దర్శనాలు షురూ చేయనున్నారు. అంతకుముందు, ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు చేపట్టనున్నారు. జూన్ 8, 9వ తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. 10వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం అందించనున్నారు. ఆపై సాధారణ దర్శనాలు ప్రారంభించనున్నారు.

ప్రతి రోజూ ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న 3 వేలమందికి, నేరుగా వచ్చే మరో 3 వేలమందికి శ్రీవారి దర్శనం ఏర్పాటు చేస్తామని టీటీడీ పేర్కొంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా గానీ వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావొద్దని స్పష్టం చేశారు. 65 ఏళ్లు పైబడినవారికి, పిల్లలకు దర్శనాలు ఉండవని అన్నారు. ఈ నెల 11 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కేవలం ఒక గంట మాత్రమే అని వెల్లడించారు. ఆపై ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలవరకు సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు.

ఇక, రాకపోకల గురించి చెబుతూ, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొన్నాళ్లపాటు అనుమతి ఉండదని, శ్రీవారి మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నామని వైవీ చెప్పారు. అలిపిరి నుంచి మాత్రమే భక్తులకు కాలినడకన అనుమతి ఉంటుందని, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే కనుమ దారుల్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అలిపిరి నడక దారిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే అనుమతిస్తామని వివరించారు. శ్రీవారి పుష్కరిణిలోనూ భక్తులకు అనుమతి లేదని వెల్లడించారు.

వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న లడ్డూల విక్రయాన్ని ఈ నెల 8తో నిలిపివేస్తున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలో కల్యాణకట్ట, శ్రీవారి హుండీ వద్ద అధిక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. జనసందోహం కారణంగా వైరస్ ప్రబలే అవకాశం ఉండడంతో శఠారి, తీర్థం ఇవ్వడంలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News