Bhuma Akhilapriya: ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై భూమా అఖిలప్రియ స్పందన!

Bhuma Akhilapriya response on AV Subba Reddy comments
  • తనను చంపేందుకు అఖిలప్రియ కుట్ర పన్నారని సుబ్బారెడ్డి  ఆరోపణ
  • ఈ వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతల హస్తం ఉండొచ్చన్న అఖిలప్రియ
  • మా మధ్య ఆస్తి తగాదాలు లేవని సుబ్బారెడ్డే చెప్పారు
టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అఖిలప్రియ స్పందిస్తూ, తనను అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ వెనకున్న ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదని చెప్పారు. ఆయన వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ అధిష్ఠానం ప్రమేయం ఉండకపోవచ్చని చెప్పారు.

తన భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని గత అక్టోబర్ లో ఓ క్రషర్ ఇండస్ట్రీ యజమాని ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారని అఖిలప్రియ తెలిపారు. దీనికి సంబంధించి బెయిల్  కోసం తాము దరఖాస్తు చేశామని... ఈ సమయంలో సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తుండటం అందరూ గమనించాల్సిన విషయమని చెప్పారు. సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో తన హస్తం ఉన్నట్టు బయటకు రాలేదని...ఏ4 ముద్దాయిగా తనకు నోటీసులు కూడా అందలేదని తెలిపారు. అయితే తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం సుబ్బారెడ్డికి తగదని చెప్పారు.

తన తండ్రి భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు సుబ్బారెడ్డి పేరు మీద ఉంటే కనుక, అవి ఆయనకే చెందుతాయని అఖిలప్రియ అన్నారు. తమ మధ్య ఆస్తి తగాదాలు లేవని సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పారని తెలిపారు. సుబ్బారెడ్డికి పదవులు ఇచ్చినా తాను అడ్డు చెప్పలేదని అన్నారు. ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటే తాను స్వాగతిస్తానని... గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు పనులు ఎలా చేయిస్తారో తనకు కూడా చూడాలని ఉందని చెప్పారు.
Bhuma Akhilapriya
AV Subba Reddy
Telugudesam
YSRCP
Allagadda

More Telugu News