China: సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం: చైనా
- లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు
- ఇరు దేశాల మిలిటరీ అధికారుల మధ్య రేపు జరగాల్సిన సమావేశం
- నేడు సానుకూల ప్రకటన చేసిన చైనా
లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య గత కొన్నాళ్లుగా ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్ ను రోజుల వ్యవధిలోనే చైనా విస్తరించడం... అక్కడ యుద్ధ విమానాలను పార్క్ చేయడం వంటివి ఉద్రిక్తతను పెంచాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై ఆసహనం వ్యక్తం చేశారు. భారత్ కూడా చైనా సరిహద్దుల వెంబడి అదనపు బలగాలను మోహరింపజేయడంతో... ఆందోళన మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఇరు దేశాల మిలిటరీ అధికారుల సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, భేటీకి ఒక రోజు ముందుగా చైనా సానుకూలంగా కీలక ప్రకటన చేసింది.
లడఖ్ ప్రతిష్టంభనను తొలగించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని చైనా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లోని పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. భారత్ కు తాము ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నామని చెప్పింది. సమస్యను పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ప్రతిపాదనను ఇరు దేశాలు తిరస్కరించాయి.