IMEI: పోలీసు అధికారి ఫోన్ పాడవడంతో వెలుగులోకి వచ్చిన సెల్ ఫోన్ కంపెనీ నిర్వాకం!
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- ఒకే ఐఎంఈఐ నెంబరుతో 13,500 ఫోన్లు
- సెల్ ఫోన్ కంపెనీపై కేసు నమోదు
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ పోలీసు అధికారి తన సెల్ ఫోన్ పాడవడంతో దానికి మరమ్మతులు చేయించారు. అప్పటికీ అది పనిచేయకపోవడంతో పోలీస్ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగికి అప్పగించి దాని విషయం చూడమన్నారు. ఆ అధికారి ఇచ్చిన సెల్ ఫోన్ ను పరిశీలించిన సైబర్ క్రైమ్ ఉద్యోగి దిగ్భ్రాంతికర విషయం గుర్తించాడు. ఆ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ తో 13,500 ఫోన్లు పనిచేస్తున్నాయని, అన్ని ఫోన్లకు ఒకటే ఐఎంఈఐ నెంబర్ అని తెలుసుకుని విస్మయానికి గురయ్యాడు.
ఈ విషయం మీరట్ ఎస్పీ అఖిలేశ్ సింగ్ వరకు వెళ్లింది. ఆ సెల్ ఫోన్ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని, ఇలాంటి లోపాలను క్రిమినల్స్ నేరపూరిత కార్యకలాపాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.