Hyderabad: హైదరాబాద్‌లో ఒకే రోజు నాలుగు హత్యలు.. నగరంలో కలకలం!

4 murders in Hyderabad in 24 hours

  • గోల్కొండలో రౌడీ షీటర్ దారుణ హత్య
  • మరో ఘటనలో చిన్ననాటి స్నేహితుడినే మట్టుబెట్టిన ప్రబుద్ధుడు
  • వీటిలో రెండు ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి

హైదరాబాద్‌లో ఒకే రోజు జరిగిన నాలుగు హత్యలు కలకలం రేపాయి. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా వారిలో ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండకు చెందిన రౌడీషీటర్ చాందీ షేక్ మహ్మద్, అతడి స్నేహితుడైన చికెన్ సెంటర్ యజమాని ఫయాజుద్దీన్‌లు రాత్రి 10 గంటల సమయంలో ఎండీ లైన్స్ నుంచి గోల్కొండకు బైక్‌పై వెళ్తున్నారు.

దీనిని గమనించిన ప్రత్యర్థులు క్వాలిస్ వాహనంలో వారిని వెంబడించి మొరైన్ బేకరీ సమీపంలో బైక్‌ను ఢీకొట్టారు. రోడ్డుపై పడిపోయిన షేక్ మహ్మద్, ఫయాజుద్దీన్‌‌లను పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు. షేక్ మహ్మద్‌ను చంపడమే లక్ష్యంగా చేసుకున్న దుండగులు ప్రాణం పోయేంత వరకు పొడిచారు. అనంతరం పెట్రోలింగ్ వాహనం శబ్దం విని క్వాలిస్‌ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న ఇద్దర్నీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భూ వివాదమే వీరి హత్యకు కారణంగా తెలుస్తోంది.

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో స్నేహితుడినే హతమార్చాడో యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్లేపల్లికి చెందిన రాహుల్ అగర్వాల్ (28), అదే ప్రాంతానికి చెందిన అజర్ (28)లు చిన్ననాటి స్నేహితులు. రాహుల్ స్థానికంగా మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో నిన్న ఉదయం అల్లాపూర్ శ్మశాన వాటిక సమీపంలో రాహుల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో ఉన్న యాక్టివాలోని పుస్తకాల ఆధారంగా చనిపోయింది రాహుల్ అని గుర్తించిన పోలీసులు.. అజరే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పరారీలో ఉన్న అజర్ కోసం గాలిస్తున్నారు.
 
ఇంకో ఘటనలో యాకుత్‌పురా చున్నేకిబట్టి చందానగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (25) దారుణ హత్యకు గురయ్యాడు. జాఫర్‌రోడ్డుకు వెళ్లే మార్గంలో నిన్న నడుచుకుంటూ వెళుతున్న ఇమ్రాన్‌పై దుండగులు కత్తితో దాడిచేసి పొడిచారు. తీవ్ర గాయాలపాలైన ఇమ్రాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్తి వివాదాలే ఇమ్రాన్ హత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News