Ram Gopal Varma: రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' ఫ్లాప్ అయితే వీళ్లంతా రోడ్డు మీదకొచ్చి డ్యాన్స్ చేసి, పండగ చేసుకుంటారు: రామ్ గోపాల్ వర్మ
- ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని చెప్పడం పెద్ద బూతు
- ఇక్కడ ఎవరి వ్యాపారం వారిది
- ఎదుటి వ్యక్తి సక్సెస్ ను భరించలేకపోవడం మానవ నైజం
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఎవరు మాట్లాడినా... 'ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం' అనే ఒక కామన్ డైలాగ్ చెపుతుండటాన్ని అందరూ గమనించే ఉంటారు. ఇటీవల బాలకృష్ణ వివాదం చెలరేగిన తర్వాత కూడా సినీ ప్రముఖులంతా సేమ్ టు సేమ్ ఇదే డైలాగును వల్లెవేశారు. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అని చెప్పడం ఒక పెద్ద 'బూతు' అని అన్నారు.
ఇండస్ట్రీలో ఎవరి బిజినెస్ వారిదని... అంతా ఒకే కుటుంబం ఎంత మాత్రం కాదని వర్మ చెప్పారు. ఎదుటివాడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం ఇండస్ట్రీలో చాలా ఎక్కువ స్థాయిలో ఉందని అన్నారు. ఒకవేళ రాజమౌళి తదుపరి చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' ఫ్లాప్ అయితే... ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది రోడ్లపైకి వచ్చి, గుడ్డలిప్పేసి, డ్యాన్స్ చేస్తూ పండగ చేసుకుంటారని చెప్పారు. ఒక వ్యక్తి సక్సెస్ ను భరించలేకపోవడం అనేది మానవ నైజమని... ఇండస్ట్రీలో కూడా అదే ఉందని అన్నారు. 'అంతా ఒక్కటే' అనేది సొల్లు అని... అది ఎప్పటికీ జరగదని అన్నారు.